26.1.09

ఆలోచనలు

ఆలోచనలు
తలనిండా ఆలోచనలు
ఎన్నో, ఎన్నో....ఎన్నెన్నో ఆలోచనలు
నిరూపం కొన్ని నిర్మాణాలు కొన్ని
మాటలై కొన్ని మరుగున కొన్ని
కన్నెర్ర కొన్ని కన్నీరు కొన్ని
అప్పటివి ... ఇప్పటివి ... ఎప్పటివో ..అన్నీ-- ఇన్నీ


తలనరాల చెలరేగే తేనెటీగలల్లె కొన్ని ..తేనె వలె కొన్ని
పుట్టి వెనువెంటనే గిట్టినవి కొన్ని, మర్రి వలె పెరిగినవి కొన్ని
లోపలివి బయటివి ఎక్కడివో? ఎక్కడికనో ఇవన్ని ...

నన్ను నిర్మించేవి నా వెన్ను విరిచేవి
ఉత్సాహ నిచ్చెనల నైరాశ్య సర్పాల వైకుంఠపాళీ ...
మంచని కొన్ని చెడ్డని కొన్ని ఊగిసలాటన ఎన్ని
తప్పని కొన్ని ఒప్పని కొన్ని తక్కెడకెక్కని వెన్ని
అవునని కొన్ని కాదని కొన్ని ఘర్షణలెన్ని ?
ఇప్పుడొకటి అప్పుడొకటి వెనుక వేరొకటి అని గొలుసులుఎన్ని

నేటి వీపునవేసినవి కొన్ని ... మాపు ముంగిట తోసినవి కొన్ని
పాతవి .. క్రొత్తవి .. ప్రతిరూపాలు ...వ్యతిరేకాలు ...
గోదారిలా కొన్ని, గొంగళిలా కొన్ని ...కూడలిన ప్రశ్నార్ధకాలు మరిన్ని
కట్టడి వీలు కాని ...
కానరాని జోరీగలు ... ఆలోచనలు
ఆపలేని నిరంతర అలలు ... ఆలోచనలు
ఊపిరాఖరువరకు ఉండే ....ఆలోచనలు