24.1.10

ఎప్పుడు పుట్టమో తెలియదు. ఊహ తెలిసినప్పుడు చూస్తే ఎదురెదురుగా ఉన్నాం. ఇంకొన్నేండ్లకు తెలిసింది .. ఊరి పొలిమేరలో ఉన్నామని . అదిగో అప్పట్నించి ఒకరికొకరం మాట్లాడుకుంటూ ఎదురెదురుగా పెరుగుతూ వస్తున్నాం.

ఏ ఇళ్ళూ కనబడేవికావు; అదిగో అప్పుడూ యిప్పుడూ అంటూ ఎవరో ఒక్కరు కనిపించేవారు . వాళ్ళ దారిన మా మధ్య నుంచి వెళ్ళేవారు ... వచ్చేవారు .. ఊరిలోకి, బయటకి . అప్పుడంటే నడక, లేదంటే ఎడ్లబండ్లు . మొన్న మొన్నటి వరకూ మేం గాలి పీల్చడానికి ఎప్పుడూ కష్టపడి ఎరుగము, ఏదో నానోక్కదాన్నే అయితే అనుకోవచ్చు ... ఎదురుగా కూడా అదే ...
మోటారు వాహనాలంట ! ఒకటే మంట !
ఇప్పుడు జనాలని ఎక్కువగానే చూస్తున్నాం ; జుర్ర్ జుర్ర్ అంటూ తిరుగుతుండ్రు . ఒకప్పుడు ; అదే మేం చిన్నగున్నప్పుడు ఊర్లో ఇండ్లు కానోచ్చేవిగావు . మేం ఎదిగినతరువాత కూడా అంగో అక్కడెక్కడో దూరంల కానోచ్చేవి ; మరి ఇప్పుడో పొలిమేర అన్నట్టే లేదు , కేకేస్తే పదిండ్లకు వినస్తాది .

ఇంతకీ మేం ఎవలమో సేప్పలేదు కదూ .. ఎప్పుడు నాటినారో తెల్వదు... పొలిమేర దగ్గర, దారికి - అదే ఇప్పుడు రోడ్డైనాదిలే - అటూ ఇటూ నాటిండ్రు; పెద్దలు ; ఓ వాళ్లెప్పుడో మేం ఎదిగేనాటికి చనిపోయిన్రు. మేం తెలివికోచ్చిన తరువాత చానా చావులే చూసినాం, వూర్లో జనాలు అంతోటి మంది ఉంటారని గప్పుడేగా తెల్సింది , ఎవ్వరు కాలం చేసినా అందరూ పొలిమేర వరకూ వచ్చేవారు . మంచిగా చావు చేసి ఒకరినొకరు ఒదార్చుకోని ఎల్లేవాళ్ళు . రాను రాను ఊరిలో ఇండ్లు పెరిగాయి గానీ మడుసులు తగ్గారేమో అనుకుంటిమి... నానూ నా తోటిది . కానీ జనాలు కాదు వారిమధ్య బంధాలు తగ్గాయని తెలియోచ్చింది .. ఎవరు సచ్చినా లెక్కకు పదీ ఇరవై కానొస్తారు. ఎవరికీ వారే అయ్యారట ఊర్లో...
సరే ... మా మానాన మాను బతుకు నడిపిసున్నాం .
బాగా గుర్తు .. ఇంతకు ముందు చిన్న పిల్లలు మమ్మల్నెక్కి ఆడుకునేవోళ్ళు ... వాళ్ళు ఓ కొమ్మ ఇరిసినా భాధ ఉండేది కాదు . మమ్మల్ని ఎవరో ఒకరు పట్టించుకునేవోళ్ళు వున్నారని తెగ మురిసేతోళ్ళం; ఇప్పుడు సంగతే వేరు ... ఎవడి దౌడు వాడిది . పిల్లలు పెద్దల్ని అనుసరిస్తారు .. గిల్లి కజ్జాలు పోయాయి.. వాళ్ళూ రాళ్ళూ కర్రలూ ఎత్తుతున్నారు.
మేం ఓ రేత్తిరి ఉల్లిక్కి పడి లేచాం. వూళ్ళో మామీద ఆడుకున్నోడు పురుగుల మందు తాగి పోయాడట, కొడుకూ కోడలూ పెట్టే ... కాదు... పెట్టని తిండి తినలేక . పుట్టి ఇన్నాల్లయ్యింది ఎన్నడూ ఇంత బాధ అనిపించలే ....

మొన్న, మా ముందే ఇద్దరు పోరగాండ్లు గొడవెట్టుకున్రు ... చూస్తా చూస్తా ... ఓ బండరాయి .. ఒకడి మీద ... వాడి నెత్తురు.. నామీద. గుండె కోసేసినాది ; అక్కడే పడినాడు, పోయినాడు. ఆ రోజుసంది ఇద్దరం దిగాలుగా మా బతుకు మొదట్నుంచీ గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరి మాటల్లో ఒకరు సేదతీరుతుండగా తెలిసింది ఓ నాడు, మా ఊరిని పెద్ద టౌనులో కలిపేసారని . మేం పోలిమేరనించి టౌను మధ్యలోకోచ్చినాం .
నేనే ఇందంతా సెబుతున్నాను.. నా ఎదుటిది మాట్లాడట్లేదని అడుగుతున్నారా ! అది సచ్చి రెండు రోజులైనాది ! రోడ్డుకడ్డంటూ మూడ్రోజులకింద గొడ్డళ్ళతో నరికి నరికి రోడ్డునేసారు ... చంపేశారు ; మరి నేనెందుకు ఈ మా జీవితాల గురించి ఇప్పుడు సెబుతున్నననా ; మా వూరు సానా బాగుండేది ... ఎటు పోతుందో ; నా ఎదురుగున్నది పోనాది ... ఇక యిప్పుడూ నా గోడు సెప్పకపోతే, రేపుదయం నా మొదలుపై గొడ్డలి వేట్లు పడుతుంటే మాట్లాడలేనుగా............

అమ్మకూ నాకూ మధ్య

నా తప్పులు నన్ను చెయ్యనీ అమ్మా
నా ఒప్పులు నన్ను చెయ్యనీ నాన్న
ఇలా ... అలా.... అని చెబితే ఎలా?
కాల్చుకోనీ ...
నేర్చుకోనీ ...

అలా అంటే ఎలారా కన్నా !
నీకైయ్యే కదరా మేం చెప్పేది
బాగుండాలనే కదరా మేం దిద్దేది ..
పది మంది చేసిన తప్పు పదకొండోసారీ చేస్తానంటే ఎలా ?
నాకు ఒప్పంటూ పదుగురినీ నొప్పిస్తే ఎలా ?
కన్నవారము కదా ... అందుకే ...
వద్దంటూ హద్దంటూ ముద్దంటూ ఉంటాము
అంతేకానీ నీమీద మమ్మల్ని రుద్దాలని కాదు !

సరే ....
నీ తప్పొప్పులు నీవే నిర్ణయించుకో !
కానీ ...
అంతటి జ్ఞానముందా అనేది ప్రశ్నించుకో
' శ్రద్ధావాన్ లబతే జ్ఞానం '
కనుక
అంతటి శ్రద్ధ అలవర్చుకో ...

అడగకుండా తెలుసుకొని మసలుకోడం గొప్పే
అట్లాగని
తెలీనప్పుడు అడగడం తక్కువా కాదు తప్పూ కాదు .